Kids Habits : ఎంతసేపు ఫోన్లలో మునిగి పోయిన పేరెంట్స్ ను చూసి పిల్లలు కూడా సర్వం ఫోను మయం అన్నట్టే తయారు అవుతారు.
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమి?
మోహన్..మోహన్ మోహన్ పారిపో
మా తాత ఉత్తరం ఏట్లో పోయింది
మా తాత ఉత్తరం ఏట్లో పోయింది
దాగుడు మూతల దండాకోర్ పిల్లి వచ్చే ఎలుకా దాగే
ఎక్కడి దొంగలు అక్కడే అక్కడే గప్‌చుప్ సాంబార్ బుడ్డీ
ఇలాంటి ఆటపాటలు పిల్లల నోట విని ఎన్నాల్లు అయింది కదా.. అసలు ఈ జనరేషన్ పిల్లలు ఇలాంటి ఆటలు ఎక్కడ ఆడుతున్నారని, ఎంతసేపూ ఫోను పట్టుకొని కూర్చోడం తప్పితే, పాపం వాళ్ళని అనడానికి కూడా లేదు..పెద్దవాళ్ళు ఎలా నేర్పిస్తే పిల్లలు అది నేర్చుకుంటారు.
పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు (Kids Habits) అదే చేస్తారు, ఎంతసేపు ఫోన్లలో మునిగి పోయిన పేరెంట్స్ ను చూసి పిల్లలు కూడా సర్వం ఫోను మయం అన్నట్టే తయారు అవుతారు.
బయట ఒక అందమయిన ప్రపంచం ఉందీ మనం ఆడుకోవడానికి బోలెడన్ని ఆటలు ఉన్నాయని వాళ్ళకి తెలిస్తేగా, తెలిసేలా మనం వాళ్ళకి చెబితేగా. ఈ జనరేషన్ పిల్లల్ని కొన్ని ఆటల పేర్లని చెప్పమంటే టక్కున చెప్పేస్తారు.. పబ్‌జి, టెంపుల్ రన్, క్యాండి క్రష్, లూడో అని.
కాని అసలు ఆట అంటే ఏంటో ఆట లో ఉండే మజా ఏమిటో తెలియాలంటే మన పెద్దవాళ్ళని అడగాలి, హాయిగా ఇంట్లో కూర్చోని ఆడుకోవాలన్నా ఆరు బయటకెళ్ళి ఆడాలన్నా బోలెడలన్ని ఆటలు చెబుతారు.
అష్టా చెమ్మ,వైకుంట పాళి, చింత పిక్కలు , కచ్చ కాయలు , వామన గుంటలు, పులి మేక ఇలా అబ్బో ఒకటా రెండా. కొన్ని సరదా కోసం ఆడేవి అయితే ఇంకొన్ని బుర్రకు పదునుపెట్టి ఆడే ఆటలు.
చదరంగం వంటి ఆటలు వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఇలా మనల్ని చురుకుగా తయారు చేసే ఆటలు ఎన్నున్నాయో, ఇక అలా బయటకి వెళ్ళి ఆడటం మొదలు పెట్టామా ఆ వీధి పిల్లలు, ఈ వీధి పిల్లలు అందరూ వచ్చి చేరేవారు కదా.
గిళ్ళీ దండా, గోళీల ఆట, తాడు బొంగరం, తొక్కుడు బిళ్ళ, ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, కుక్క దూకుళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్ని ఆటలు కదా.
ఇలాంటి ఆటలు ఆడుతుంటే పిల్లలకి అసలు టైమే తెలియదు సరికదా బోలెడంత నేర్చుకుంటారు, ఇలాంటి ఆటలు వాళ్ళకి ఏకాగ్రతను పెంచుతాయి, వారి టాలెంట్‌ను పరీక్షిస్తాయి, జాగ్రత్తగా అడుగేయమని చెప్తాయి. పరిసరాలను పరిశీలనగా చూడడం నేర్పిస్తాయి, ఫిట్‌నెస్ కు పరీక్ష పెడుతాయి.
ఆడపిల్లలయినా, మగపిల్లలయినా అందరికి బోలెడంత (Kids Habits) వ్యాపకం , కావల్సినంత వ్యాయమం అవుతుంది,స్కూల్ నుంచి వచ్చామా బ్యాగు అక్కడ పడెసామ ఆటలకి పరుగెత్తామ అన్నట్టు ఉండేది అప్పుడు.
ఈ కాలం పిల్లలు మాట్లాడితే ఏడ్వడం ,పెద్దవాళ్ళ మీద అరవడం లేదా అలగడం. కొంతమంది పిల్లలయితే కనీసం తోటి పిల్లలతో మాట్లాడరు.
ఇతర పిల్లలతో కలవడం, ఆడుకోవడం, పోటీ పడడం, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం తరువాత కలిసి పోవడం ఇవేమి చేత కావాట్లేదు ఈ జనరేషన్ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ మెంటల్ ఎక్స్‌పోజర్ అంతే ఉంటుంది.
ఒకప్పుడు స్కూల్స్ అంటే పెద్ద ప్లేగ్రౌండ్ ఉండేది, ఇప్పటి స్కూల్స్ లో అగ్గిపెట్టెల్లో పిల్లల్ని మగ్గ పెట్టేస్తున్నారు తప్పితే వారి మానసిక ఎదుగుదల గురించి ఎక్కడ పడుతోందీ.
ఎంతసేపూ ర్యాంకులూ ర్యాంకులూ అంటు వారి బుర్రల్ని సెప్టిక్ ట్యాంకుల్లాగా తయారు చేస్తున్నారు తప్ప పిల్లల్లో ఉండే సహజమయిన చురుకుదనాన్ని పట్టించుకోవట్లేదు.
అటు స్కూల్స్ లోను,ఇటు ఇంట్లోను పుస్తకాలతో కుస్తీలు తప్పితే బయట నిజమయిన కుస్తీలు పడితేనే కదా ఫిట్‌నెస్ పెరిగేది.
సెలవులస్తే దగ్గర్లోని చెరువులో, వాగులోకి దూకి గంటల పాటు (Kids Habits) ఈతలు కొట్టేవాళ్ళు. కొత్త స్నేహాలు చేసుకోవడం శరీరం అలిసి పోయేంత వరకు ఆటలు ఆడడం, ఆ తరువాత మంచి ఆకలితో ఇంటికి చేరి ఆవురావురు మంటూ కడుపు నిండా తిండం మళ్ళి తిన్నదంటా కరిగించడం ఇదీ కదా మన పెద్ద వాళ్ళ ఆరోగ్య సూత్రం.
కాని ఇప్పుడు “ప్లీస్ అమ్మా ఒక ముద్ద తిను, ప్లీస్ కన్నా ఇంకాస్త తినమ్మ” అని బతిమాలుకోవాలి, అది కూడా వాళ్ళు స్టైల్‌గా సోఫా లో కూర్చోని ఏ ఫోనో, టివీనో (Kids Habits) చూస్తున్నప్పుడే నోట్లో కుక్కేయాలి, లేకపోతే ఈ జనరేషన్ పిల్లలు వినరు కదా..
కొందమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు శ్రీ శ్రీ..
చూడబోతుంటే ఇ కాలం పిల్లలు యువకులు కాకముందే వృద్దులై పోతారేమోనని భయం వేస్తోంది, దీనంతటికీ మనమే కారణం. పెద్దలే కారణం.
మీ పిల్లల ఫ్యూచర్ మీద నిజంగా శ్రద్ధ ఉంటే ఇప్పుడే ఫోన్ పక్కన పడేయండి, చక్కగా మీ పిల్లల చేయి పట్టుకొని దగ్గర్లో ఉన్న గ్రౌండ్‌కో పార్క్‌కో తీసుకెళ్ళండి. మీకు తెలిసిన పాత కాలపు (Kids Habits) ఆటలన్ని కొత్తగా పరిచయం చేయండి. వారెంత ఎక్సైట్ అవుతారో చూడండి. వారిలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు.
వారు ఫిసికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా ఎంత స్ట్రాంగ్ అవుతారో చూస్తే మీకు కడుపు నిండి పోతుంది. మీ ఫేస్‌బుక్‌లు,ఇన్స్ట్ఆలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఎక్కడికి పోవు, కాని మీ పిల్లల (Kids Habits) బాల్యం అలా కాదు కాలం కరిగిపోతే తిరిగి రాదు ఆలోచించుకోండి.
ఇప్పటికైన ఆ ఫోనులని పక్కన పడేసి వారితో టైం స్పెండ్ చేయండి వారిని బయటకి తీసుకెళ్ళి కొత్త ఆటలు ఆడండి.