లైఫ్ స్టైల్

Egg Dosa Recipe : నోరూరించే ఎగ్ కారం దోస

egg dosa
Egg Dosa : దోస పిండి, కారం ఉంటే, బ్యాచులర్స్ కూడా 5 నిమిషాలలో చేసుకోవడానికి ఈజీ పద్దతి చూడండి.

కావలసిన పదార్థాలు (Egg Dosa):

1. మినపగుళ్ళు – 1 కప్పు
2. దోసల బియ్యం – 2 1/2 కప్పులు
3. అటుకులు – 1/2 కప్పు
4. మెంతులు – 1 టీ స్పూన్
5. గ్రుడ్డు – ఒకటి
6. ఎండు మిరపకాయలు – 100 గ్రాములు
7. చింతపండు – నిమ్మపండు సైజ్
8. వెల్లులి – 15 నుంచి 20 రెబ్బలు
9. ఉప్పు – రుచికి సరిపడ
10. నూనె – తగినంత
11. కరివేపాకు – 2 రెమ్మలు
12. ఆవాలు – 1 టీ స్పూన్

దోస పిండి కోసం (Egg Dosa) :

egg dosa

ఎగ్ దోస కోసం ఒక కప్పు మినపగుళ్ళు, రెండున్నర కప్పుల దోశల బియ్యం, అర కప్పు అటుకులు, ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి విడివిడిగా నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి. అవన్నీ నానిన తర్వాత నీటితో మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని పన్నెండు గంటల పాటు పులియపెట్టుకోవాలి.

పులియబెట్టిన పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

దోస కారం తయారీ (Egg Dosa):

egg dosa

దీని కోసం ముందుగా వంద గ్రాముల ఎండు మీరపకాయలను తీసుకోవాలి, అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి ని తీసుకొని, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును వేసి కాసిన్ని నీటిని వేసి మిక్సీ లో మెత్తటి పేస్ట్ ని చేయండి. మెత్తటి పేస్ట్ అంటే మిరపగింజలు కూడా పేస్ట్ లో మెదిపి కలిసిపోవాలి. అంత మెత్తగా ఉండాలి ఆ పేస్ట్.

ఇప్పుడు పాన్ లో 75 ml నూనెను తీసుకొని మరిగించాలి. అందులో అర టీ స్పూన్ ఆవాలు, రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని తర్వాత మెత్తగా చేసుకున్న ఆ కారం పేస్ట్ ని వేసుకోవాలి. చట్నీ ని నూనె పైకి తేలేంత వరకు మీడియం మంట మీద కలుపుతూ వేపుకోవాలి. ఈ పచ్చడి మీద ముత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఉడుకుతున్న ఈ పచ్చడి పైకి చిందుతుంది కాబట్టి దీని మీద మూత పెట్టుకోవాలి. 15 నిముషాల తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలేంత వరకు వేపుకుంటేనే ఎర్ర కారం నెల రోజులకు పైన నిల్వ ఉంటుంది.

దోస తయారీ (Egg Dosa) :

egg dosa

దోస కోసం పెనాన్ని బాగా వేడి చేయాలి. బాగా వేడి ఎక్కిన తర్వాత, మంట తగ్గించి వేడెక్కిన పెనం మీద ఒక పెద్ద గరిటెడు పిండి వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి. అట్టు అంతా అంచుల వెంట రెండున్నర టీ స్పూన్ల నూనెని పోసుకోవాలి. ఎగ్ దోస కి ఎక్కువగా నూనె ఉండాలి అప్పుడే భలే రుచిగా ఉంటుంది.

దోస పైన పిండి మగ్గి ఎర్రపడడం మొదలవుతుంది. సరిగ్గా అప్పుడు అట్టు మద్యలో ఒక టేబల్ స్పూన్ ఎర్ర కారాన్ని ఇంకా ఒక గ్రుడ్డుని పగలగొట్టి నెమ్మదిగా ఆట్టంతా స్ప్రెడ్ చేయాలి. అట్టు మీద ఎగ్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మంటను మీడియం లోనే ఉంచుకోవాలి, లేదంటే అట్టు అడుగు భాగాన మాడిపోతుంది. ఎగ్ దోస ఏ మాత్రం మాడిన అస్సలు రుచిగా ఉండనే ఉండదు.

ఎగ్ ని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఒక అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ఎగ్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నిముషం మాత్రమే కాలనివ్వాలి. ఆ తర్వాత వెంటనే తిప్పి మరోవైపు ముప్పై నుంచి నలభై సెకనులు మాత్రమే కాల్చుకోవాలి. ఇంతకంటే ఎక్కువ సేపు కాలిస్తే గ్రుడ్డులోని చెమ్మ ఆరిపోయి గట్టిగా అయ్యి ఎగ్ దోస అంతా రుచిగా ఉండదు, ఇది చాలా ముఖ్యమైన విషయం.

ఇది కూడా చదవండి : రోజు ఎనిమిది(8) గంటలు కన్నా ఎక్కువ కూర్చుంటే ముప్పే